అమరావతి : వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో వడ్డెర్ల కష్టాలను మంత్రి నారా లోకేశ్ స్వయంగా చూశారన్నారు. ఆనాడే వారి సంక్షేమానికి, ఆర్థిక ఉన్నతికి పలు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం కేటాయింపు, సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇస్తూ మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు. వడ్డెర స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం శాశ్వత జీవో తీసుకొచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమన్నారు. వడ్డెర్లను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.
అంతకు ముందు మంత్రి సవితను కలిసి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, డైరెక్టర్లు, ఆ సామాజిక వర్గీయులు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఆర్థిక భరోసా కలిగించేలా మైనింగ్ లీజులు కేటాయింపులతో పాటు సినరేజీ మినహాయింపు ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియ జేశారు. అనంతరం మంత్రి సమక్షంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, డైరెక్టర్లు దుర్గారావు, దుర్గా మహాలక్ష్మి, వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన వడ్డెర సామాజిక ప్రతినిధులు కుంచాల సావిత్రి, మణికుమారి, శ్రీరామ్, ఉప్పు శ్రీను, వేముల బాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

















