అమరావతి : వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . ఏలూరు నగర అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన శ్రీ రెడ్డి అప్పల నాయుడు కు టికెట్ కేటాయింపు గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. సామాన్యులకు రాజకీయ అవకాశాలను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పిస్తారని చెప్పారు. కార్పొరేటర్ టికెట్ల కేటాయింపుపై కూటమిలో స్పష్టత ఉందన్నారు. స్థానిక సమస్యలు, పరిష్కారాలు పట్ల అభ్యర్థులకు ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ఏలూరులో మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడారు. ఏలూరు నగర అభివృద్ధి కోసం పని చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం అన్నారు. హమాలీ కూలీ గా, కార్మిక సంఘాల నాయకుడిగా పని చేసిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు లాంటి వ్యక్తిని ఏలూరు మేయర్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎంపిక చేయడం గొప్ప విషయం అని ప్రశంసించారు.
కూటమి పార్టీలు సమన్వయంతో పని చేసి 2024 కంటే మంచి మెజారిటీతో ఏలూరు మేయర్ పీఠం సాధిస్తామన్నారు. ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి, సూపరిపాలన, సంక్షేమంలో అయిదో స్థానం లో నిలిచిందన్నారు. ‘22 ఏ’ భూముల పరిష్కారం ఏలూరులోనే మొదలు పెట్టాం అన్నారు. త్వరలో 22 సీ లో ఉన్న భూముల సమస్య తీర్చేలా పరిష్కారం వెతుకుతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏలూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాం అన్నారు మనోహర్. ఒకపక్క రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతుంటే, స్థానిక సంస్థల పరిధిలో సైతం మరింత అభివృద్ధి చేసేలా ఈ ఎన్నికల్లో విజయం దోహద పడుతుందన్నారు. జనసేన పార్టీ అభ్యర్థి అయిన రెడ్డి అప్పలనాయుడుని మేయర్ గా, 62 డివిజన్లలో కూటమి పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధిలో ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాం అన్నారు.


















