శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. రాయలసీమను సీఎం చంద్రబాబు నాయుడు సస్యశ్యామలం చేస్తున్నారని, ఆయన హయాంలోనే సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారని చెప్పారు. రెండేళ్లలో హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 50 టీఎంసీల కృష్ణా జలాలను తరలించామన్నారు. వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.2,011 కోట్లే ఖర్చు చేశారని, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.12,500 వెచ్చించిందని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి వైసీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆనాడే జగన్ ను వైసీపీ నేతలు ఎందుకు నిలదీయలేదని మంత్రి సవిత ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారన్నారు.
అన్న ఎన్టీఆర్ తెలుగు గంట, హంద్రీ-నీవా, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యూలేటర్ వంటి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారన్నారు ఎస్. సవిత . ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమను సస్య శ్యామలం చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. 2014-19 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు వెచ్చించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ.6,600 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారన్నారు. ఈ రెండేళ్ల కాలంలో హంద్రీ – నీవా ద్వారా రాయలసీమకు 52 టీఎంసీల నీటిని తీసుకొచ్చామన్నారు. 19 నియోజక వర్గాల్లో ఉన్న 420 చెరువులను నీటితో నింపామన్నారు. తుంగభద్ర (టీబీ) డ్యామ్ ఆధునీకీకరణ, క్రస్ట్ గేట్ల మార్పిడికి రూ.35 కోట్లు వెచ్చించామన్నారు. రూ.750 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా శ్రీకారం చుట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సవిత తెలిపారు.
















