తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. కేవలం టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే తిరుమలలో వైకుంఠ ద్వార దర్వనం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిప్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించడం జరిగిందని అన్నారు. ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శన భాగ్యం కలుగుతుందని స్పష్టం చేశారు. టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించు కునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామని, చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.



















