అమరావతి : ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై సిఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. సిఎస్, డీజీపీతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. తుఫాను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం–కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వివరించారు. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు.
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వివరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు. 24, 25వ తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపారు. 261 మండలాల్లో 129 మండలాలకు భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షం, 9 మండలాలకు అతి భారీ వర్షం, 2 మండలాలకు తీవ్ర వర్షం కురుస్తుందన్నారు. ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకల్లో ఆకస్మిక ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.















