తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ద్వారా భక్తులకు విస్తృతంగా బ్రహ్మోత్సవాల సమగ్ర సమాచారాన్ని అందజేస్తున్నట్లు టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి తెలిపారు. మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధులకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, టి.వి, హై స్పీడ్ ఇంటర్నెట్, వై-ఫై సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మీడియా మిత్రుల కొరకు రుచికరమైన భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులతో రోజువారీ విభాగాల వారీగా ప్రెస్ నోట్లు, ఫోటోలు క్రమం తప్పకుండా అందించడం జరుగుతోందన్నారు. కల్యాణవేదిక వద్ద శ్రీవారి ఆలయ చరిత్రను కలగట్టేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తుల ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో 2000 సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవారిసేవ 25 ఏళ్లలో దాదాపు 18 లక్షల మంది శ్రీవారి సేవకులు శ్రీవారి సేవకు విచ్చేసినట్లు సీపీఆర్వో డాక్టర్ టి.రవి తెలిపారు. తిరుమలలో శ్రీవారి సేవ నిరంతర యజ్ఞంగా కొనసాగుతోందని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం, క్యూలైన్లు, అన్న ప్రసాదం విభాగం సహా టీటీడీలోని వివిధ విభాగాల్లో సుమారు 4,500 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని చెప్పారు. గరుడ సేవ రోజున నాలుగు మాడ వీధుల్లో సుమారు 2,000 మంది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, తాగునీటి పంపిణీ వంటి సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సేవకుల విధులను సమన్వయం చేసేందుకు 150 మంది గ్రూప్ సూపర్వైజర్లను నియమించామని అన్నారు. వీరు సేవకుల విధులను పర్యవేక్షించడంతో పాటు, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను సేకరిస్తారని చెప్పారు.
భక్తుల రద్దీ పెరిగి క్యూలైన్లు వెలుపలికి విస్తరించే పరిస్థితుల్లో సేవలను పర్యవేక్షించేందుకు అదనంగా 20 మంది గ్రూప్ సూపర్వైజర్లను ప్రత్యేకంగా నియమించినట్లు పేర్కొన్నారు. టీటీడీ సోషల్ మీడియా ద్వారా కూడా బ్రహ్మోత్సవాల సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా అందించడం జరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు విశ్వసనీయమైన, అధికారిక సమాచారాన్ని అందించేందుకు డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని చెప్పారు సీపీఆర్ఓ. శ్రీవారి బ్రహ్మోత్సవాల అధికారిక సమాచారం, తాజా అప్డేట్ల కోసం టీటీడీ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించడంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి సోషియల్ మీడియా రీల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు.
తిరుమలలో గతంలో ఉన్న 10 సమాచార కేంద్రాలతో పాటు, అదనంగా మరో 10 సమాచార కేంద్రాలు, తిరుపతిలో 2 కేంద్రాలతో పాటు, అదనంగా మరో 3 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో డాక్టర్ టి.రవి తెలిపారు. తిరుమల, తిరుపతిలలో మొత్తం 25 సమాచార కేంద్రాలలో భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, ఇతర సౌకర్యాలకు సంబంధించిన సమాచారం పొందేందుకు ఈ కేంద్రాలు భక్తులకు సహాయ పడుతున్నాయని తెలిపారు.
