గుంటూరు జిల్లా : ప్రపంచంలోనే అరుదైన నాయకుడు, ప్రజలు మెచ్చిన ధీరోదాత్తుడు ఒకే ఒక్కడు , ఈ యుగానికి ఒక్కడు దివంగత నందమూరి తారక రామారావు అని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలోని రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది కూడా ఎన్టీఆరేనని , ఆయన వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇవాళ పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఆయన వల్లనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ సైతం సంక్షేమం ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు.
భారత దేశ రాజకీయాలలో ఎన్టీఆర్ ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. ఆయన లాంటి నాయకుడు పుట్టరని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాసరనేని జశ్వంత్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత తదితరులు పాల్గొన్నారు.

















