UPI : దేశంలో డిజిటల్ లావాదేవీల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న మొత్తాల నుంచీ లక్షల రూపాయల వరకు ప్రజలు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న భారత యూపీఐ వ్యవస్థలో వినియోగదారుల సౌలభ్యం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పన్నులు, బీమా ప్రీమియంలు, రుణ ఈఎంఐలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ప్రధాన చెల్లింపులు యూపీఐ ద్వారా మరింత సులభం కానున్నాయి.
UPI – కొత్త పరిమితి ఎంత?
సెప్టెంబర్ 15 నుంచి ప్రత్యేక లావాదేవీలకు ఒకేసారి రూ. 5 లక్షలు, రోజుకు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సాధారణంగా ఉన్న రూ. 1 లక్ష పరిమితి వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది.
ఏ లావాదేవీలకు వర్తిస్తుంది?
ఈ మార్పు కేవలం పర్సన్ టు మర్చంట్ (వ్యక్తి నుంచి వ్యాపారికి) చేసే లావాదేవీలకే వర్తిస్తుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) చేసే యూపీఐ చెల్లింపులకు మాత్రం పాత పరిమితి రూ. 1 లక్ష యథావిధిగా కొనసాగుతుంది.
పెరిగిన పరిమితితో అనుమతించబడిన లావాదేవీలు
- పన్ను చెల్లింపులు – ఒకేసారి రూ. 5 లక్షలు, రోజుకు రూ. 10 లక్షలు.
- బీమా & క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు – ఇంతకు ముందు రూ. 2 లక్షలు మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ. 5 లక్షలు. రోజుకు రూ. 10 లక్షల వరకు.
- రుణ ఈఎంఐలు, బీ2బీ వసూళ్లు – ఒక్క లావాదేవీకి రూ. 5 లక్షలు, రోజుకు రూ. 10 లక్షలు.
- క్రెడిట్ కార్డ్ బిల్లులు – లావాదేవీకి రూ. 5 లక్షలు, రోజుకు రూ. 6 లక్షల వరకు.
- విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలు – ఒక్క లావాదేవీకి రూ. 5 లక్షల పరిమితి.
- డిజిటల్ ఖాతాలు, ఎఫ్‌డీలు – కొత్త ఖాతాలు, డిపాజిట్లకు రూ. 5 లక్షల పరిమితి.
అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా?
ఎన్‌పీసీఐ ఈ నిర్ణయాన్ని అన్ని బ్యాంకులు, యాప్‌లు, పేమెంట్ సేవా ప్రొవైడర్లకు వర్తింపజేస్తోంది. అయితే బ్యాంకులు తమ భద్రతా విధానాల ప్రకారం అమలు చేసే తేదీలను నిర్ణయించుకోవచ్చు. ఎక్కువగా సెప్టెంబర్ 15 నుంచే ఈ కొత్త పరిమితి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రయోజనం ఎవరికీ?
ఈ మార్పుతో ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, బీమా ప్రీమియం చెల్లించే వారు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి పెద్ద సౌలభ్యం లభించనుంది. అయితే IPO లావాదేవీలకు మాత్రం పాత పరిమితి రూ. 5 లక్షలు అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read : GST on Gold Price : బంగారంపై జీఎస్టీ ఎంతో తెలుసా? అయితే ఇది చుడండి



















