హైదరాబాద్ : ప్రముఖ విలక్షణ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వినాయకుడి ‘విసర్జన’ పూర్తయింది, ఇక మిగిలింది జ్ఞానేష్ కుమార్ ‘విసర్జన’ మాత్రమే:నని అన్నారు. సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అది ఓటర్ల జాబితాను ‘శుద్ధి’ చేసే ప్రక్రియ అని చెప్పినప్పటికీ, వాస్తవానికి అది అందరినీ కలుపుకొనిపోయే ప్రక్రియ కాకుండా పేర్లను ‘తొలగించే’ ప్రక్రియగా తేలిందని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన వారిలో 38 లక్షల మందికి సంబంధించిన అప్పీళ్లు ట్రిబ్యునళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
వాటిపై నిర్ణయం తీసుకోవడానికి 10-12 ఏళ్లు పట్టవచ్చని వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావించారు ప్రకాష్ రాజ్. అంత పెద్ద సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారులు అంతకాలం వేచి ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక, ఆంధ్ర , భారతదేశం అంతటా గణేశ విసర్జన పూర్తయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను తొలగించడమే మిగిలి ఉందన్నారు. ఎన్నికలు అంటే కేవలం అంకెలు కాదని, అవి దేశంలోని సజీవ పౌరులకు సంబంధించినవని అన్నారు. ప్రజలను కలవడానికి తాను వివిధ జిల్లాల్లో 10 రోజుల పర్యటన చేశానని చెప్పారు. బూత్ స్థాయి అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో లేనందున మాత్రమే తమ పేర్లను తొలగించారని ప్రజలు తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన దినసరి కూలీల పేర్లను కూడా ఓటర్ల జాబితా నుండి తొలగించారని ఆయన ఆరోపించారు.
