న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గురువారం నీట్ – పీజీ -2026 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ పారదర్శకతపై ప్రశ్నించింది. పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదే తరుణంలో దాఖలైన పిటిషన్పై కేంద్రం స్పందన కోరింది సుప్రీంకోర్టు. పరీక్షా ప్రశ్నలు, సమాధానాల ఎంపికలు, అభ్యర్థులు నమోదు చేసిన సమాధానాలు , సరైన సమాధానాలను చూసే అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి, నేషనల్ మెడికల్ కమిషన్కు (ఎన్ఎంసీ) నోటీసులు జారీ చేసింది. నీట్ పీజీ 2026 ఆన్సర్ కీ , అభ్యర్థుల సమాధానాల వెల్లడి ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ , జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది విచారణ సందర్బంగా .
కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ , ఇతర సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో జత చేసింది. డెమోక్రటిక్ మెడికల్ అసోసియేషన్స్ తోపాటు మరికొందరు దాఖలు చేసిన ఈ పిటిషన్లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు ఇచ్చిన అసలు ప్రశ్నలు, సమాధానాల ఎంపికలు, వారు నమోదు చేసిన సమాధానాలు , సరైన సమాధానాలను చూసే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న విధానంలో, తమ సమాధానాలను సరిగ్గా మూల్యాంకనం చేశారో లేదో అభ్యర్థులు స్వయంగా సరి చూసుకునే అవకాశం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష ఆగస్టు 30న నిర్వహిండం జరిగింది. జైపూర్లోని ఒక పరీక్షా కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, అక్కడ ప్రభావితమైన అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 5న తిరిగి పరీక్ష (రీ-ఎగ్జామ్) నిర్వహించారు.


















