అమరావతి : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలో సమాధానం చెప్పారు. ఆనాడు 2014-19లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్య శ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అని స్పష్టం చేశారు. 63.20 టిఎంసిల నీటితో 8లక్షల ఎకరాలకు సాగు నీరు, 30 లక్షల మంది ప్రజలకు తాగు నీటితో పాటు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా రూపొందించడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకంను ఫేజ్-1లో 2022 కోట్లు, ఫేజ్-2 లో 4210 తో పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు నిమ్మల రామానాయుడు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాధాన్యతను గుర్తించి కూటమి ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్ళేలా శ్రద్దపెట్టామన్నారు. ఈ బడ్జెట్ లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల కోసం 500 కోట్లు, భూసేకరణకు 100 కోట్లు, మొత్తం 600 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి 460 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం అవ్వాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాలువ కీలకంగా ఉంటుందన్నారు. 2014-19 లో చేసిన పనులు తప్పా, గత 5ఏళ్ళ వైసిపి పాలనలో ఒక్కరూపాయి ఖర్చు గానీ, తట్ట మట్టి గానీ,అరబస్తా సిమెంట్ పని గానీ చేయలేదన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో 63 కోట్లు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పెట్టారని అన్నారు.
















