అమరావతి : ఏపీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయబట్టే ఎన్ఎఫ్‌డీబీ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రముఖ ఆక్వాకల్చర్ రాష్ట్రంగా ఉండటంతో అమరావతిలో పూర్తి స్థాయి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి, ప్రాథమిక మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లేఖ ద్వారా తెలియ జేశారని మంత్రి వెల్లడించారు.
దేశంలో ఆక్వాకల్చర్ రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, ఫీడ్ మేనేజ్‌మెంట్, వ్యాధి నియంత్రణపై శిక్షణలు స్థానికంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఆర్థిక సహాయం వేగవంతంగా చేరేలా సహకరిస్తుందన్నారు. ప్రాసెసింగ్, నిల్వ, రవాణా, ఎగుమతుల రంగాల్లో సాంకేతిక మద్దతు లభించడం ద్వారా మత్స్య ఉత్పత్తుల నాణ్యత మెరుగు పడుతుందన్నారు.
