Nerella Sharada : హైదరాబాద్ : మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా (Nerella Sharada) హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్ పర్సన్ కు ప్లే చేసి చూపించింది.
Nerella Sharada Comments on Women Journalist
పలు సోషల్ మీడియా హ్యాండిల్లు నిరంతరం విద్వేష వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, దాడులు చేస్తూ మహిళా జర్నలిస్టులను అవమానించాలని, భయపెట్టాలని చూస్తున్నాయని వారు తెలిపారు. తమపై “క్రమబద్ధమైన ఆన్‌లైన్ వేధింపుల ధోరణి” కొనసాగుతోందని తెలిపారు. కొన్ని హ్యాండిల్లు, ఉద్దేశ పూర్వకంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, ప్రాణ హానికర బెదిరింపులు, అవహేళనాత్మక పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నాయని చెప్పారు. ఈ ట్రోలింగ్ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. విద్వేష పూరిత, మత పరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిల్స్ విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు. సంబంధిత హ్యాండిల్స్, వ్యక్తులపై దర్యాప్తు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆన్‌లైన్–భౌతిక రక్షణను కల్పించాలని కోరారు. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : KTR Shocking Comments : పత్తి రైతులపై సర్కార్ వివక్ష తగదు : కేటీఆర్


















