ఒంటిమిట్ట : తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరా మస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భాగంగా నాలుగో రోజు సోమవారం నవనీత కృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధ మనోహరంగా దర్శనం ఇచ్చారు భక్త బాంధవులకు.
ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేపల్లెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న ఆరగించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తరుణంలో ఏప్రిల్ 1న సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రాములోరికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాట్లు విస్తృతంగా చేశారు.



















