అనకాపల్లి : ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నేను 2023వ సంవత్సరంలో యువగళం పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్రలో లక్షలాది మందిని కలిశాను. ప్రతి సంభాషణ నా మనసులో చెరగని ముద్ర వేసిందన్నారు. జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నపుడు రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముతున్న మోహన అనే మహిళను కలిశాను. ఆమె తన భర్త మద్యానికి బానిసై చని పోయాడు. అప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేసి, తన ఇద్దరు కొడుకులకు మంచి చదువు చెప్పించింది. ఆమెతో మాట్లాడినప్పుడు, డబ్బు లేదా ఇతర సహాయం అడగలేదు.
ప్రభుత్వం నుంచి ఏమీ అవసరం లేదు… నా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పింది. ఆమె మాటలు నాపై బలమైన ముద్ర వేశాయని అన్నారు నారా లోకేష్. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నేను చేసిన ప్రకటనకు ఆమె మాటలే ప్రేరణ అని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు పూర్తయిన సమయంలో, ఈ భూమిపూజ నా జీవితంలో భావోద్వేగ ఘట్టం. ఆంధ్రప్రదేశ్ యువతకు నేను ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ భూమిపూజ అవిశ్రాంత కృషి, ధైర్యం, నమ్మకాలకి దక్కిన ఫలితం అని అన్నారు. మేము ఇప్పుడు దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నామన్నారు. భారతదేశంలో నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ గా ఏపీని మార్చామని స్పష్టం చేశారు.
