న్యూఢిల్లీ : పార్లమెంట్ లో ఇవాళ పూర్తి స్థాయిలో ఏపీ రాజధానిగా అమరావతి బిల్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఆమోదం పొందింది. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులతో పాటు ఎంపీలు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఎంపీలతో కలిసి ప్రత్యేకంగా మోదీ నివాసానికి వెళ్లారు. ఆయన కు కృతజ్ఞతలు తెలియ పరిచారు.
రైతుల త్యాగాలను ప్రస్తావించారు. రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
నారా లోకేష్ ప్రధానమంత్రికి శాలువా కప్పి గౌరవించగా, ప్రధాని మోదీ ఆయనను అభినందించారు. అనంతరం, లోకేష్, ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి, సభలో బిల్లు ఆమోదానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఇది అమరావతి తీర్మానం చారిత్రాత్మకమని అన్నారు. బిల్లు ఆమోదం పొందినందుకు యావత్ తెలుగు ప్రజలంతా ముక్త కంఠంతో మోదీకి రుణపడి ఉన్నామని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి కలను సజీవంగా ఉంచడానికి, సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితిలో తమ భూములను సమీకరించి, దృఢంగా నిలబడి, అపారమైన త్యాగాలు చేసిన మన రైతుల అసాధారణ గాథను కూడా నేను పంచుకున్నాను. అమరావతిని నిజమైన ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించడం ద్వారా వారి త్యాగాన్ని గౌరవించడంలో ఆయన నిరంతర మార్గదర్శకత్వాన్ని కోరానంటూ తెలిపారు.
