డిసెంబ‌ర్ లో నంది అవార్డుల ప్రదానోత్సవం

ప్ర‌క‌టించిన సినిమాటోగ్ర‌ఫీ మంత్రి

hellotelugu-APGovt

అమ‌రావ‌తి : ఏపీ సినిమాటోగ్ర‌ఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ క‌ళాకారుల‌కు తీపి క‌బురు చెప్పారు. నిరాదరణకు గురైన కళారంగానికి కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తెస్తోందని పేర్కొన్నారు. డిసెంబర్‌లో విజయవాడ లేదా అమరావతిలో నంది ఫిల్మ్ అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరిలో తెనాలిలో నంది నాటకోత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు నాటకరంగ కళాకారులకు కందుకూరి పురస్కారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే చాలా మంది కవులు, కళాకారులను ఉగాది పురస్కారాలతో పాటు బోయి భీమన్న, గుర్రం జాషువా, గిడుగు రామమూర్తి పంతులు వంటి మహానుభావుల పేరిట అవార్డులు అందజేసి సత్కరించమన్నారు.

కూటమి ధర్మాన్ని పాటిస్తూనే అక్టోబర్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీలకు విడిగా, కూటమికి విడిగా సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాయని, తరుచూ ఆ భేటీల్లో పాల్గొని బలబలాలు చర్చిస్తున్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఉండ్రాజవరంలో వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటుపై స్పందిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన మెరుగైన స్థలాన్ని గుర్తించామని, ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చి చెప్పారు. రాజమహేంద్రవరంలో 138 మందితో కూడిన ఇండియన్ రిజర్వ్ దళానికి కఠినమైన శిక్షణ పూర్తయిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. సైబర్ క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలతో పాటు, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మానవ విలువలపై శిక్షణ పొందారని, రేపటి నుండే వారు విధుల్లోకి చేరతారని వెల్లడించారు.

ఈ సందర్భంగా రెండున్నరేళ్ల క్రితం నాటి ఏపీ పర్యాటక రంగానికి, ప్రస్తుత స్థితికి మధ్య ఉన్న స్పష్టమైన మార్పును గమనించాలని మంత్రి దుర్గేష్ ప్రజలను, మీడియాను కోరారు..

Exit mobile version