హైదరాబాద్ : మన్మథుడిగా ఇప్పటికే పేరు పొందిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటుడిగా, హోస్ట్ గా పేరు పొందారు. చాన్నాళ్ల తర్వాత విలక్షణ నటిగా గుర్తింపు పొందిన టబుతో కలిసి నటించనుండడం మరింత ఆసక్తిని రేపుతోంది. అక్కినేని నాగార్జున నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం కింగ్ 100. తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ను చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగా నటి టబు పాత్రకు సంబంధించిన మొదటి గ్లింప్స్ ను బుధవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని విడుదల చేసింది. నాగార్జున , టబు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రకటన అందరిలోనూ కుతూహలాన్ని పెంచింది.
అంతే కాకుండా ఈ ప్రమోషనల్ వీడియోలో ఈసారి, ఇది ప్రేమ కాదు అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఉండటం విశేషం. ఇది సినిమాలో టబు పాత్ర ఎలాంటిది? నాగార్జునతో ఆమెకున్న సంబంధం ఏమిటి? అనే అంశాలపై రకరకాల ఊహాగానాలకు దారితీసింది. తాజా ప్రమోషనల్ మెటీరియల్‌లో టబు పాత్రకు సంబంధించిన చిన్న పరిచయం కనిపిస్తుంది. చీరకట్టులో ఉన్న టబు, పాతకాలపు రేడియో పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండటం ఆమె పాత్రపై ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించింది. పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచినప్పటికీ, ఆ ట్యాగ్‌లైన్‌ను బట్టి చూస్తే, ఈసారి నాగార్జున , టబుల మధ్య పూర్తిగా భిన్నమైన సమీకరణం ఉండబోతోందని అర్థమవుతోంది.
వీరిద్దరూ మళ్లీ తెరపై కలిసి కనిపిస్తుండటం, గతంలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని గుర్తుచేసుకునే అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన విషయం ఉండనుంది. ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్ 100’, నాగార్జున నట ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణాన్ని పురస్కరించుకుని వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ , టి-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

















