పాలమూరు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో సర్పంచ్ లు, వార్డు సభ్యులు అత్యధిక స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన వారే గెలుపొందారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న పాలమూరు జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తన స్వంత ఊరు రంగారెడ్డి గూడలో తనకు చుక్కెదురైంది. ఈ సందర్బంగా ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నా ఊరు కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశానని, అభివృద్ది పనులు చేశానని చెప్పారు.
చివరకు తనను ఓడించారని, తన గుండె మీద దెబ్బ కొట్టారంటూ వాపోయారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. తాను అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని, ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు జడ్చర్లకు తీసుకు వచ్చానని చెప్పారు. అయినా ప్రజలు తనకు బిగ్ షాక్ ఇచ్చారంటూ పేర్కొన్నారు అనిరుధ్ రెడ్డి. ప్రస్తుతం తన స్వంత ఊరులో తను బలపర్చిన అభ్యర్థి గెలవక పోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అయినా ప్రజా తీర్పును శిరసావహించక తప్పదన్నారు. ఈ ఫలితంపై తాను రివ్యూ చేస్తానని, ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై సమీక్ష చేస్తానని అన్నారు.

















