తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు భక్తులను కటాక్షించారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతూ, స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపు పందిరి వాహనంపై స్వామివారి దర్శనం భక్తులకు విశేష ఆనందాన్ని కలిగించింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ముత్యం చంద్రునికి ప్రతీకగా భావించ బడుతుంది. ముత్యాల పందిరి కింద స్వామివారి దర్శనం తాపత్రయాలను తొలగించి, భక్తుల జీవితాలకు శాంతి, చల్లదనాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. ఈ వాహనసేవలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది రాకుండా చూడాలని ఇప్పటికే ఆదేశించారు జేఈవో వి. వీరబ్రహ్మం. మరో వైపు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి.

















