హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు బావ బామ్మర్దులు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ముందు వీరిని బొక్కలోకి తోయాలంటూ ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని, తమ ఇష్టానుసారం పాలన సాగించిన సంగతి ప్రజలు ఇంకా మరిచి పోలేదన్నారు రఘునందన్ రావు. బావ బామ్మర్ది నోరు మూయించక పోతే కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందని, ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని అన్నారు .
ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నా కాంగ్రెస్ ఏమీ చేయడం లేదంటూ నిప్పులు చెరిగారు రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని జైల్లో వేయలేదన్నారు. ఇదే సాకుగా చూసుకుని బావ బామ్మర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సిట్-2 అయినా ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముగింపు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే కేటీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. వీరి అరెస్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
