న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం తను పని చేస్తోందో ఎన్నికల కమిషనర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే పనిలో బిజీగా ఉందన్నారు ఈసీపై. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇంకెంత కాలం 143 కోట్ల భారతీయులను మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
తాను పలుమార్లు దేశంలో జరిగిన ఎన్నికల సందర్బంగా చోటు చేసుకున్న ఓట్ల చోరీకి సంబంధించి పక్కా ఆధారాలతో సహా నిరూపించినా ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈసీ నిర్వాకాన్ని, మోదీ, అమిత్ షాల చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్, ఇతర సీనియర్ నాయకులు వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

















