హైదరాబాద్ : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. 2019–24 మధ్య రైతులు 54 రోజుల వరకు డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు. 2023-24 రబీ సీజన్‌కు సంబంధించిన రూ.1,674 కోట్లు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చెల్లించిందన్నారు. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.13,858 కోట్లు రైతులకు చెల్లించామని వెల్లడించారు. 2025-26లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంతో పని చేసి, 11-02-2026 నాటికి రూ.10,571 కోట్లు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని, అందులో 55% చెల్లింపులు 8 గంటల్లోపు పూర్తి చేశామని తెలిపారు.
రాష్ట్రంలో 129 రైతు బజార్లు పనిచేస్తుండగా, మరో 11 పురోగతిలో ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నం (MVP కాలనీ, గోపాలపట్నం), విజయవాడ, గుంటూరు, తిరుపతిలో PPP పద్ధతిలో ఆధునిక రైతు బజార్లు నిర్మిస్తున్నామని తెలిపారు. 25 రైతు బజార్లను రూ.5.92 కోట్లతో ఆధునీకరించి ISO సర్టిఫికేషన్ పొందామని వెల్లడించారు. రైతు సంక్షేమానికి కట్టుబడి 2026-27 సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు రూ.515.39 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు నష్టపోకుండా, వినియోగదారులు ఇబ్బంది పడకుండా మార్కెట్ స్థిరీకరణ చర్యలు కొనసాగిస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు.
రాష్ట్రంలో ఉద్యాన రంగ అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014-19 మధ్య 6.58 లక్షల హెక్టార్లలో 5.91 లక్షల రైతులకు మైక్రో ఇరిగేషన్ అమలు చేయగా, 2019-24 మధ్య కేవలం 2.9 లక్షల హెక్టార్లలో 2.6 లక్షల రైతులకు మాత్రమే అమలైందన్నారు. గత ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు రూ.1166 కోట్ల బకాయిలు ఉంచగా, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే రూ.881 కోట్లు చెల్లించిందన్నారు.

















