అమరావతి : ప్రజా భద్రతే ధ్యేయంగా ఆధునిక పోలీసింగ్ పని చేస్తోందని చెప్పారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం, కృష్ణదేవిపేట, గొలుగొండ మండలాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు స్పీకర్. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం SIS (Special Infrastructure Scheme) కింద ఒక్కో పోలీస్ స్టేషన్‌కు రూ.2.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మించడం జరిగిందన్నారు . ఈ నూతన భవనాల్లో సిసిటివి కెమెరాలు, ఆధునిక కౌన్సిలింగ్ గదులు, మహిళా పోలీసులకు ప్రత్యేక విశ్రాంతి గదులు, బందోబస్తు విధుల కోసం వచ్చే సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రభుత్వం ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తోందని చెప్పారు అయ్యన్నపాత్రుడు. జిల్లా పోలీసులు గత రెండు సంవత్సరాలుగా ఎస్పీ నేతృత్వంలో బాగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. నాతవరం, గొలుగొండ ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా దారులపై గట్టి నిఘా ఉంచాలని, ఎటువంటి సిఫార్సులకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే మా సంకల్పం అని హోంమంత్రి ప్రకటించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు, ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు.
