హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై నోరు పారేసుకున్నారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు తాతా మధు. ఓఎస్డీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. నిన్న బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బనియనతో శాసన సభ, మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనపై పోలీసులు చేయి చేసుకున్నారంటూ ఎమ్మెల్సీ తాతా మధు రెచ్చి పోయారు. ఆపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి నోరు జారారు. ఆపై అనరాని మాటలు అనడంతో అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది.
స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. ఇదిలా ఉండగా తాతా మధు పూర్తి పేరు తాతా మధుసూదన్. ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే 4 జనవరి 2028 వరకు ఉంది. తాతా మధుసూదన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ ఐలో పనిచేశారు. అనంతరం వామపక్ష రాజకీయాలతో అనుబంధం ఏర్పడింది.
