అమరావతి : జియో హాట్ స్టార్ మా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్ -9 సీజన్ ఎట్టకేలకు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్బంగా భారీ ఎత్తున అంచనాల మధ్య విజేతగా నిలిచాడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసన సభ నియోజకవర్గానికి చెందిన జవానుగా పని చేస్తున్న కళ్యాణ్ పడాల. ఈ సందర్బంగా నియోజకవర్గం ప్రజల తరపున తనను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి. భోగాపురం మండలం సుందరపేట అనే ఒక చిన్న గ్రామం నుండి బిగ్ బాస్ వేదిక వరకు సాగిన నీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి బిగ్ బాస్ కిరీటాన్ని కైవసం చేసుకోవడం ద్వారా.. నిజాయితీ, పట్టుదల ఉంటే ఏ కల అయినా సాధ్యమేనని నువ్వు నిరూపించావంటూ ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే. ముఖ్యంగా, ‘అగ్నిపరీక్ష’ ప్రమోషన్స్ సమయంలో కళ్యాణ్ నన్ను (ఎమ్మెల్యేని) కలిసినప్పుడు, బిగ్ బాస్ విజేతగా నిలిచి నెల్లిమర్ల నియోజకవర్గానికి పేరు తీసుకు రావాలని నేను మనస్ఫూర్తిగా దీవించానని గుర్తు చేశారు లోకం నాగ మాధవి. ఈ రోజు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, నువ్వు నెల్లిమర్ల నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచావంటూ పేర్కొన్నారు. మన స్థానిక యువత ప్రతిభకు, ధైర్యానికి నీ విజయం ఒక నిదర్శనం అని ప్రశంసించారు. నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
