అమరావతి : మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలను..శాసనమండలిలో మంత్రి అనిత తిప్పికొట్టారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని అనిత స్పష్టం చేశారు. ఈ సంవత్సరం మహిళపై అత్యాచారాలు, హత్యలు నాలుగు శాతం తగ్గాయని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. NDA ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిందన్నారు. గంజాయి నిర్మూలనకు ఈగల్ అనే ఒక ప్రత్యేకమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.
గంజాయి సాగును జీరో చేశామని అన్నారు వంగలపూడి అనిత. మదనపల్లి ఘటన చాలా బాధాకరమన్నారు. కానీ దారుణానికి ఒడిగట్టిన నేరస్థుడిపై ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నేరాలు చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మహిళా రక్షణ, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. పోక్సో కేసుల్లో శిక్షలు 15 శాతం పెంచగలిగామన్నారు. 506 మందికి శిక్షలు పడితే.. అందులో 9 మందికి మరణ శిక్షలు పడ్డాయని,
169 మందికి జీవితఖైదు పడిందని చెప్పారు.నేరస్థులకు బెయిల్ రాకముందే శిక్షలు వేయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.














