Minister Seethakka : ములుగు జిల్లా : రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి దాసరి సీతక్క (Minister Seethakka) సంచలన ప్రకటన చేశారు. బాల్య వివాహాలు ఎవరు చేసినా లేదా ప్రయత్నం చేసినా వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ. పాలను ప్రతిరోజూ అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీతక్క. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించడంపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. తమ ప్రభుత్వం ప్రధానంగా దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి కృత నిశ్చయంతో ఉన్నదని స్పష్టం చేశారు మంత్రి.
Minister Seethakka Shocking Comments
అందులో భాగంగానే ఎక్కువగా వెనుకబాటు తనంతో ఉన్న ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని చెప్పారు దాసరి సీతక్క. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని కోరారు. ముఖ్యంగా తల్లితండ్రులను కలిసి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు. అలాగే కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు పని చేసేలా అంగన్వాడీలు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించారు. తల్లి తండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తుచేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
Also Read : Minister Atchannaidu Clear Update : 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ


















