అనంతపురం జిల్లా : ఏపీలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి నారా వారి పల్లెలో సందడి చేశారు. ఈ సందర్బంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. బుధవారం పెనుకొండ స్వగృహంలో భోగి మంటలు వెలిగించారు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత . కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్ధంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు.
భోగి మంటల చుట్టూ చేరిన ప్రజలకు మంత్రి సవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని, కొత్త ఆశలు, కొత్త శుభారంభాలకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు. రైతుల కష్ట ఫలితానికి గుర్తుగా సంక్రాంతి పండుగను జరుపు కోవడం ఆనందకరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ఈ కొత్త ఏడాదిలో అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి ఎస్. సవిత. గత సర్కార్ ఏపీని సర్వ నాశనం చేసిందన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు.
