తాడేపల్లి/అమరావతి : శెట్టి బలిజల పితామహుడు బొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన సేవలు నేటి యువతకు ఎంతో ఆదర్శమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. మహాత్మా గాంధీ కంటే ముందే వయోజన విద్య కోసం కృషి చేసిన మేధావన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, శెట్టిబలిజ సమాజ అభ్యున్నతికి, విద్యకు కృషి చేసిన మహానీయుడన్నారు. 1853 మార్చి 23న జన్మించిన దొమ్మేటి వెంకరెడ్డి వయోజన విద్య వ్యాప్తికి విశేష కృషి చేశారన్నారు. 1905లో బర్మాలో శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి, ఆ సంఘం ద్వారా దేశంలో ప్రాథమిక పాఠశాలలు, గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలను నెలకొల్పారన్నారు. అనంతరం కోనసీమలో కూడా శెట్టి బలిజల ఐక్యతకు, వయోజన విద్యకు కృషి చేశారన్నారు.
ఆనాటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ తనవంతు పాత్ర పోషించారన్నారు. తుది శ్వాస విడిచిపెట్టే వరకూ శెట్టిబలిజల ఐక్యతకు, వారి అభ్యున్నతికి పాటు పడ్డారన్నారు. వెంకటరెడ్డి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎందో ఆదర్శమన్నారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునా యుడు బీసీలు, శెట్టి బలిజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు సవిత. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ, శెట్టి బలిజల పితామహుడు బొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, శెట్టి బలిజ సామాజిక వర్గీయులు పాల్గొన్నారు
















