అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించిందని, దీంతో అనంతపురం జిల్లాలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్డీటీకి అడ్డంకులు తొలగి పోయాయని అన్నారు మంత్రి ఎస్. సవిత. ఆర్డీటీ నిధుల సమీకరణలో సాంకేతిక అంశాల కారణంగా విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ) నిలిచి పోయిందని తెలిపారు. ఇదే విషయమై తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను ఒప్పించి, ఆర్డీటీ సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ) పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో తరచూ మాట్లాడుతూ, ఆర్డీటీ సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ కు అనుమతులు వచ్చేలా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు కూడా కృషి చేశారన్నారు ఎస్. సవిత. ఎనిమిది నెలల కిందట ఇదే వేదిక మీద ఆర్టీడీ విదేశీ నిధుల రెన్యూవల్ ను పునరుద్ధరించి తీరుతామని తెలిపామని గుర్తు చేశారు. చెప్పిన మాటకు కట్టుబడుతూ ఆర్టీడీ విదేశీ నిధుల రెన్యూవల్ ను పునరుద్ధరించామన్నారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం వైసీపీకి అలవాటుగా మారిందని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. ఆర్డీటీ సేవలు నిలిపేసినా, జగన్ ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. తాము వచ్చాక ఆర్టీడీ సేవలు పునరుద్ధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. తమ వల్లే ఆర్డీటీ విదేశీ నిధుల రెన్యూవల్ ను పునరుద్ధరించారని వైసీపీ చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి సవిత విమర్శించారు.
