విశాఖపట్నం జిల్లా : విశాఖ పట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వేలాది మంది భక్తులతో క్రిక్కిరిసి పోయింది. ఏప్రిల్ 20వ తేదీన సోమవారం చందనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చందనోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, కుటుంబ సమేతంగా దర్శించు కోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో తొలి దర్శనం అనంతరం, భక్తుల కోసం క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. స్లాట్ పద్ధతిలో దర్శనాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నాయన్నారు.
క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, క్యూ లైన్లలో ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడటం జరిగిందని చెప్పారు వంగలపూడి అనిత. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. అత్యంత రద్దీగా ఉండే ఈ పర్వదినాన, అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తులకు సేవలందిస్తోందని తెలిపారు. భక్తులందరికీ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అన్నారు వంగలపూడి అనిత.
