ములుగు జిల్లా : మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సోమవారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈసారి గతంలో కంటే ఎక్కువగా భక్తులు హాజరవుతారని తాము అంచనా వేస్తున్నామన్నారు. అందుకు తగినట్టుగానే సర్కార్ భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు గాను తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కోల్ కతా, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సమ్మక్క, సారలమ్మలను దర్శించు కునేందుకు వస్తున్నారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు పొన్నం ప్రభాకర్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ బస్సులు వేశామన్నారు . ఇందులో భాగంగా మొత్తం 51 ఆర్టీసీ సంస్థకు చెందిన కేంద్రాల నుంచి 4 వేల స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. అంతే కాకుండా చిన్న పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
