ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి సర్ ప్రైజ్ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పారు. ఘటన జరిగిన రోజు, అంతకుముందు భోజనం ఎలా ఉందని విద్యార్థులను మంత్రి అడిగారు. భోజనం బాగా లేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు.
ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ ఆహారాన్ని విద్యార్థులు డస్ట్ బిన్ లో పడేసిన ఘటనపై సిబ్బందిని ఆరా తీశారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలిస్తున్నారా అని వాకబు చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీపై పవిత్ర బాధ్యత ఉంది. చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవాలి, పరిష్కరించాలి. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దని మంత్రి హెచ్చరించారు నారా లోకేష్.

















