అమరావతి : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రస్తుతం జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అన్యాయంగా రోడ్డున పడ్డ ఆంధ్రులకు అమరావతి ఒక ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ఏ నాయకుడూ చేయలేని సాహసాన్ని చంద్రబాబు చేశారని, కేవలం ఒక పిలుపుతో రైతులు తమ విలువైన భూములను రాజధాని కోసం ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ నేడు లక్షల కోట్ల ఆదాయాన్ని ఇస్తోందన్నారు. అమరావతి కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందితే, ఏటా వచ్చే 4-5 లక్షల కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోని అన్ని మూలలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. అమరావతి అనేది ఒక ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్’ అని, ఇక్కడ పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ అని స్పష్టం చేశారు.
గత 20 నెలల కూటమి పాలనలో రాష్ట్రం పురోగతి బాట పట్టిందని మంత్రి వివరించారు. కేంద్ర నిధుల సాధన: వైసీపీ తేలేకపోయిన వేల కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి సాధించిందని, వాటిని ప్రజల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి, కర్నూలుకు కారిడార్, ప్రకాశం-నెల్లూరు జిల్లాలకు పోర్టులు, రిఫైనరీలను తీసుకు వస్తున్నామని తెలిపారు. విశాఖను డేటా సెంటర్ , సాఫ్ట్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, అమరావతిని ప్రపంచ నగరాలతో పోటీ పడేలా నిర్మిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
పెట్టుబడిదారులు వసతులు, కనెక్టివిటీ ఉన్న చోటకే వస్తారని.. జగన్ లాగా ‘చెట్టు కింద కూర్చుని చర్చలు జరపండి’ అంటే ఎవరూ రారని మంత్రి ఎద్దేవా చేశారు. రాజధాని చట్టంపై తన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని, అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అప్పులు తెచ్చినా, సంపద సృష్టించి వాటిని తీర్చే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని మంత్రి పార్థసారధి పునరుద్ఘాటించారు.
