అమ‌రావ‌తిపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

విరుచుకుపడ్డ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

hellotelugu-Atchannaidu

అమ‌రావ‌తి/మంగ‌ళ‌గిరి : రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే జగన్ పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయ పథంలో దూసుకెళ్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అని, గత వారం రోజులుగా 5 కోట్ల మంది ప్రజలు ఆనందోత్సవాలతో పండుగ చేసుకుంటున్నార‌ని తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వతంత్ర భారతదేశంలో పార్లమెంట్, రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిరం, CAA, వక్ఫ్ బిల్లు సవరణ, మతమార్పిడి వ్యతిరేక చట్టాలు వంటి అనేక అంశాలపై రాజకీయ పార్టీల మధ్య విభేదాలు వచ్చినా ఎక్కడా ఏకాభిప్రాయం రాలేదని అన్నారు.

అయితే అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించి పార్లమెంట్‌లో వాకౌట్ చేసిందని విమర్శించారు. తెలుగు జాతి రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న కక్ష చరిత్ర చూస్తే అర్థమవుతుందని, చంద్రబాబు ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా 5 కోట్ల మంది ఆంధ్రుల అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నష్టం జరగకుండా చివరి నిమిషం వరకు పోరాడిన నాయకుడు చంద్రబాబేనని గుర్తుచేసి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలు రాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి, హైదరాబాద్‌లో 13 గంటల పాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి అందరి అభిప్రాయంతోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు.

Exit mobile version