ముంబై : ఏపీని టూరిజం రంగానికి కేరాఫ్ గా మారుస్తున్నామని ప్రకటించారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా (HICSA) 2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించారు.ఈ సందర్భంగా అమర్ చిత్ర కథ, శ్రేమ్ గ్రూప్, అకార్, హయత్ హోటల్స్ కార్పొరేషన్, బ్రిగేడ్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్, ది ఒబెరాయ్ గ్రూప్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ముఖ్యంగా తీరప్రాంత పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లు, ఎక్స్‌పీరియన్షియల్ టూరిజం అభివృద్ధిపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు కందుల దుర్గేష్.
ఈ పర్యటనలో భాగంగా ఆలివ్ గ్రూప్‌తో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్పారు. దీని ద్వారా రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,000కు పైగా హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఇది రాష్ట్ర హాస్పిటాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకు రానుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమగ్ర పర్యాటక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మైస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఆధ్యాత్మిక, తీరప్రాంత పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
పెట్టుబడిదారులకు పారదర్శక పాలన, సింగిల్ విండో అనుమతులు, వేగవంతమైన క్లియరెన్సులు, భూమి అందుబాటు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు వంటి అన్ని సౌకర్యాలు అందిస్తున్నామన్నారు కందుల దుర్గేష్. ప్రతి పెట్టుబడిదారుడికి ప్రతి దశలో ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందన్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధత లభించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన దిశ, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిందన్నారు కందుల దుర్గేష్.
