Minister Jupally : నాగర్ కర్నూల్ జిల్లా – త్వరలోనే తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) అన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్ కు హెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
Minister Jupally Krishna Rao Comments on Heli Tourism
దీని వల్ల పర్యాటక రంగం కూడా కొత్తమలుపు తిరుగుతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అమరగిరిలో రూ. 45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్ నిర్మాణ పనులు, రూ. 1.60 కోట్లతో సోమశిల విఐపీ ఘాట్ , బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి జూపల్లి (Minister Jupally) భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక ఆతిథ్యానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాటక ప్రాజెక్ట్ లు చేపడుతోందన్నారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత పదేండ్లలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందన్నారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. . తద్వారా ఉద్యోగ కల్పనతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయని చెప్పారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తామన్నారు జూపల్లి.
Also Read : Deputy CM Pawan Interesting Update : ఆడ పడుచులకు శ్రావణ మాస కానుక
















