కడప జిల్లా : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన బనగానెపల్లెలో పర్యటించారు. ఈ సందర్బంగా అవుకు రిజర్వాయర్ కు సంబంధించి జరుగుతున్న రివిట్మెంటు పనులను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. రివిట్మెంటు పనుల్లో లీకేజీలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని బీసీ జనార్దన్ రెడ్డి ఆదశించారు. అవుకు జలాశయం రివిట్మెంట్ మరమ్మత్తు పనులలో నాణ్యత ఉండాలన్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో లీకేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో పరిశీలించి, మరమ్మత్తు పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇదే సమయంలో మరమ్మత్తు పనులకు నిధులు సరిపోకపోతే తెలియ చేయాలని అన్నారు.
తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడతానని, నిధులు త్వరితగతిన తీసుకు వస్తానని స్పష్టం చేశారు బీసీ జనార్దన్ రెడ్డి. ప్రధానంగా మరమ్మత్తుల పనుల నాణ్యత ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు. లేకపోతే ఎవరైనా, ఎంతటి వారైనా , నిర్లక్ష్యం వహించినట్లు తన పరిశీలనలో తేలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి. గతంలో ఏలిన జగన్ రెడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రివిట్మెంట్ పనులను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ పూర్తి చేసి ఉంటే ఇవాళ నీళ్లు ఆయకట్టుకు అంది ఉండేవని అభిప్రాయపడ్డారు. తమ సర్కార్ వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందన్నారు.
















