కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట

ఏపీ అభివృద్ధికి బలమైన పునాది కానుంది

hellotelugu-Atchannaidu

అమరావతి : కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌లో దాని విస్తరణకు రూ.155.32 కోట్ల కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ దేశ వ్యవసాయ రంగానికి స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తుందని ఆయన కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు భూమి సారాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుందని అన్నారు అచ్చెన్నాయుడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకు ఈ కేటాయింపులు ఎంతో ఉపయోగకరంగా మారతాయని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు అచ్చెన్నాయుడు. రైతుల ఆదాయ వృద్ధికి స్పష్టమైన దిశ ఈరోజు కేంద్ర బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కేంద్రంగా రూపొందించిన ఈ బడ్జెట్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు. రిజర్వాయర్లలో చేపల పెంపకం, మత్స్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. అలాగే పశు సంవర్ధక శాఖకు ప్రోత్సాహకాలు పెంచడం పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.

Exit mobile version