గుంటూరు జిల్లా : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర రెవెన్యూ , రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం సాధించారని , ఏం ఒరగ బెట్టారని జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారంటూ ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కావాలని అల్లకల్లోలం చేసేందుకు కుట్రకు తెర లేపాడంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీయటమే జగన్ లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగిన వాళ్ళందరినీ కలుపుకొని దండయాత్రలా గుంటూరు జిల్లాకు వెళ్లారని ఆరోపించారు.
అనుమతికి మించి పెద్ద ఎత్తున జనాలతో రోడ్లపై బీభత్సం సృష్టించారని ధ్వజమెత్తారు. ఒక మాజీ సీఎంగా పని చేసిన వ్యక్తి సోయి లేకుండా ప్రవర్తించడం దారుణమన్నారు అనగాని సత్య ప్రసాద్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను తరిలిస్తున్న అంబులెన్స్ కు దారి కూడా ఇవ్వక పోవడం క్షమించరాని నేరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల పేరుతో అలజడి సృష్టించడానికి అంబటిని పరామర్శించారని ఫైర్ అయ్యారు. గతంలో తన పర్యటనలో మృతి చెందిన సింగయ్యను జగన్ ఎందుకు పరామర్శించ లేదంటూ ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టేలా అంబటి వ్యాఖ్యలు చేస్తే జగన్ ఆద్యం పోస్తున్నారని మండిపడ్డారు.
