Milk : దేశవ్యాప్తంగా వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ డైరీ బ్రాండ్ అముల్ తో పాటు మదర్ డెయిరీ వంటి ఇతర కంపెనీలు కూడా తమ పాల (Milk) ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ తగ్గింపు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది.
Milk – సాధారణ కుటుంబాలకు ఊరట
పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి ప్రతిరోజూ వినియోగించే ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల పెరుగుతున్న దైనందిన ఖర్చుల మధ్య ప్రతి కుటుంబానికీ ఇది ఉపశమనం కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.
తగ్గింపునకు కారణం
అముల్ 700కి పైగా ఉత్పత్తులపై ఈ ధరల తగ్గింపును అమలు చేయనుంది. వీటిలో వెన్న, నెయ్యి, పనీర్, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, ఫ్రోజన్ స్నాక్స్ వంటి వస్తువులు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లు తగ్గించడం వలన ఏర్పడిన లాభాన్ని వినియోగదారులకు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
కొత్త ధరలు ఇలా
- 100 గ్రాముల వెన్న: రూ.62 → రూ.58
- 500 గ్రాముల వెన్న: రూ.305 → రూ.285
- 1 లీటర్ నెయ్యి ప్యాక్: రూ.650 → రూ.610
- 5 లీటర్ల టిన్ నెయ్యి: రూ.3,275 → రూ.3,075
- అముల్ తాజా టోన్డ్ మిల్క్ (1 లీటర్ UHT): రూ.77 → రూ.75
- అముల్ గోల్డ్ మిల్క్ (1 లీటర్ UHT): రూ.83 → రూ.80
- ఫ్రోజన్ పనీర్ (200 గ్రాములు): రూ.99 → రూ.95
ఇతర కంపెనీలు కూడా సిద్ధం
అముల్‌తో పాటు మదర్ డెయిరీ కూడా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో మరికొన్ని డైరీ బ్రాండ్లు కూడా ఈ దారిలో నడిచే అవకాశం ఉందని అంచనా.
పండుగ సీజన్‌కి శుభవార్త
దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం వినియోగదారులకు అదనపు ఊరట కలిగించనుంది. కంపెనీలు కూడా ధరలు తగ్గడంతో వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
Also Read : Indian Railways Important Update : రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు బదిలీ చేసే అవకాశం



















