ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది

hellotelugu-aprains

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆగ్నేయ బంగాళా ఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్ల‌డించారు. రాబోయే 24 గంట‌ల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళా ఖాతం, పశ్చిమ మధ్య బంగాళా ఖాతం ప్రాంంతాల్లో వాయు గుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్పా మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించారు ఎండీ.

ఇదిలా ఉండ‌గా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపారు ప్ర‌ఖ‌ర్ జైన్. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నిన్న రాత్రి విజయనగరం(జి) నెల్లిమర్లలో 49.7 మిమీ, కృష్ణా(జి) ఘంటసాలలో 44.7 మిమీ, తిరుపతిలో (జి) 27.7మిమీ వర్షపాతం నమోదైందని వెల్ల‌డించారు .

Exit mobile version