హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ ప్రత్యేక దూత, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సంబంధించి రాజ్యసభ ఎన్నికల పిటిషన్ ను మధ్య ప్రదేశ్ లో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
రాజకీయ విలువలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన పరిధికి మించి వ్యవహరించారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కోర్టు నోటీసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి , దేశంలోని కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా మోదీకి, అమిత్ షాకు, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇది అత్యంత అప్రజాస్వామికమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత నిజాయితీపరురాలైన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే తప్పా మరోటి కాదన్నారు.
















