హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఇకపై ఒకే యాప్‌లో తీసుకు రానున్నట్లు పేర్కొంది. ఆర్టీసీ సొంతంగా ఆటోలు నడుపుతుంది అనే వార్తల్లో నిజం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణీకులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా ‘మీటికెట్’ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకు రావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు.
ఆర్టీసీ , మెట్రో , ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ యాప్‌లో అనుసంధానం అవుతాయి. ప్రయాణీకుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్‌తో పాటు, తన గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు చెల్లించిన రుసుమును ఆయా రవాణా విభాగాలు/భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జమ చేసే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది. ‘మీటికెట్’ అనేది ఒక ఉమ్మడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణాదారులు భాగస్వాములుగా చేరి, ప్రయాణీకులకు నేరుగా సేవలు అందించి లబ్ధి పొందవచ్చు. వినియోగదారుడు తనకు కావలసిన రవాణా విధానాన్ని ఎంచుకుని, ఒకే టికెట్/యాప్ ద్వారా సమగ్రమైన ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు ఈ విధాసం దోహద పడుతుంది. అదేవిధంగా ప్రయాణికుడు చెల్లించిన డబ్బు ఆయా రవాణా విభాగాలకు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది.
ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడుపుతుంది అని ఇటీవల సోషల్ మీడియా, కొన్ని పత్రికలు, ఇతర వేదికల్లో జరుగుతున్న ప్రచారాలపై ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. ప్రయాణీకులు , ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
