Medaram Jathara : ములుగు జిల్లా, మేడారం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతరకు తేదీలు ఖరారయ్యాయి. మేడారం జాతర (Medaram Jathara) పూజారుల సంఘం తాజా ప్రకటనలో, వచ్చే ఏడాది (2026) జనవరి 28 నుండి 31వ తేదీ వరకు ఈ మహా జాతర ఘనంగా నిర్వహించనున్నట్టు తెలియజేసింది.
Medaram Jathara – జాతర కార్యక్రమాల వివరాలు ఇలా:
జనవరి 28: సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద కొలువు దీరతారు.
జనవరి 29: సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి గద్దెకు చేరుకుంటుంది.
జనవరి 30: భక్తులు భారీగా విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
జనవరి 31: సమ్మక్క, సారలమ్మల వనప్రవేశం జరగనుంది. ఇదే రోజున జాతర ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ సందర్భంగా, గద్దె వద్ద కొలువుదీరి ఉన్న వనదేవతలు తిరిగి అడవికి వెళ్లే “వనప్రవేశం” కార్యక్రమం ఉత్సాహభరితంగా జరుగుతుంది. ఈ ముగింపు దృశ్యాలను చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
కోట్లాదిగా వచ్చే భక్తులు – అన్ని రాష్ట్రాల నుంచే రాకపోకలు
2014లో మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ మహా జాతర అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి కోటికి పైగా భక్తులు ప్రతి జాతరసారిగా తరలివస్తుంటారు.
భక్తుల మొక్కులు – బెల్లంతో భక్తిశ్రద్ధ
ఈ జాతరలో భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు బెల్లాన్ని సమర్పించడం సంప్రదాయం. బంగారంతో సమానంగా భావించే ఈ బెల్లం సమర్పణ ద్వారా భక్తులు తల్లుల అనుగ్రహం పొందుతారని నమ్మకం. జాతర రోజుల్లో మేడారం ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతుంది.
సర్వ సన్నాహాలు ప్రారంభం
ఇప్పటికే పూజారుల సంఘం తేదీలు ఖరారు చేయడంతో, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం గ్రామం మహా జాతరకు (Medaram Jathara) మళ్లీ సిద్ధమవుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులు భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టనున్నారు. రవాణా, మంచినీరు, వైద్యం, బస, భద్రత మొదలైన అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయాలతో నిర్వహించేందుకు ప్రభుత్వం, పూజారులు, స్థానిక కమిటీలు సమిష్టిగా పని చేస్తున్నారు.
Also Read : Delhi Bonalu Interesting : ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు



















