హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 0 – 10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యాసన స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ దృష్టికి తెచ్చారు. చిన్న వయసులో పోషకాహారం లోపం వల్ల భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించక పోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన తెలియజేశారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సూచించారు.
ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు వివరించారు.
అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్ సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అన్నారు.
