కోల్ కతా : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం మమతా బెనర్జీని ఏకి పారేశారు. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలకు ఆనాటి టీఎంసీ సర్కార్ అడ్డు పడిందని ఆరోపించారు. కానీ ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పట్టారని , వారికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి శివార్లలో ఉన్న కదమ్‌తాల ఎస్ఎస్బీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సశస్త్ర సీమా బల్ వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. గతంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం తన స్వప్రయోజనాలను కాపాడు కోవడం కోసం కొత్త చట్టాల అమలును వాయిదా వేసిందని ఆయన ఆరోపించారు. సిలిగురిలోని కవాఖలీ మైదానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత , భారతీయ సాక్ష్య అధినియం) ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం షా ప్రసంగించారు.
పార్లమెంటు ఆమోదించిన కొత్త క్రిమినల్ చట్టాలను గత ప్రభుత్వం నోటిఫై చేయలేదని మండిపడ్డారు అమిత్ షా. తద్వారా “సిండికేట్, కట్-మనీ ,బలవంతపు వసూళ్ల వ్యవస్థ”ను కాపాడుకోవాలని చూసిందని ఆయన విమర్శించారు. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ చట్టాలు, ప్రస్తుతం ఉన్న భయానక వాతావరణాన్ని తొలగించి విశ్వాసాన్ని నెలకొల్పే దిశగా నిర్ణయాత్మక అడుగు వేశాయని షా స్పష్టం చేశారు. దేశమంతా కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడం ప్రారంభించినప్పటికీ, బెనర్జీ వాటిని ఎప్పుడూ నోటిఫై చేయలేదు. ఈ చట్టాలు తన సిండికేట్, కట్-మనీ , బలవంతపు వసూళ్ల వ్యవస్థకు ముగింపు పలుకుతాయని ఆమెకు తెలుసు అని షా అన్నారు. రాష్ట్రంలో చట్ట పాలనను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్న ఆయన, కొత్త క్రిమినల్ చట్టాలు న్యాయం అందించే ప్రక్రియను వేగవంతం చేస్తాయని చెప్పారు.

















