హైదరాబాద్ : బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీలపై భగ్గుమన్నారు. బేషరతుగా బీసీలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. బీసీల ఉసురు తగిలిందని అందుకే మాధవరెడ్డి ఓటమి పాలయ్యాడని అన్నారు. బీసీ ద్రోహి మాధవరెడ్డిని ఓడించిన కేశవాపూర్ ప్రజలకు అభినందనలు తెలియ చేశారు. శనివారం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మాధవరెడ్డిని నిలబెట్టిన మల్లారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని లేక పోతే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని అన్నారు. బీసీలకు వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా వారికి మాధవరెడ్డి గతే పడుతుందని హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికలలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ కేశవాపూర్ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బిసి రిజర్వేషన్ల వ్యతిరేకి బుట్టంగారి మాధవరెడ్డి, బీసీల ఉసురుతగిలి ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. బీసీల నోటికాడు ముద్దను గుంజుకుని, బిసిల తినే కంచంలో మన్ను పోసిన బీసీ ద్రోహి మాధవరెడ్డిని ఓటు ఆయుధంతో ఓడించాలని తాము ఇచ్చిన పిలుపును గౌరవించారని చెప్పారు. కేశవపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మద్దతు పలికే ప్రజాస్వామ్యవాదులు ఒక్కటై తగిన శాస్తి చేశారని, ఇందుకు తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీ ప్రజల తరఫున ఓడించిన కేశవాపూర్ వార్డు ప్రజలకు రుణపడి ఉంటారన్నారు.
















