OLA-Uber : మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఓలా (Ola), ఉబర్‌లకు (Uber) ప్రత్యామ్నాయంగా సొంతగా అభివృద్ధి చేసిన యాప్ ఆధారిత రవాణా సేవను ప్రారంభించనుంది. ప్రయాణికులకు సరసమైన ధరలతో రవాణా సేవలు అందించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొంది రాష్ట్ర రవాణా శాఖ.
OLA-Uber – సర్వీసులో ఏముంటాయి?
ఈ కొత్త రైడ్‌హెలింగ్ యాప్‌లో టాక్సీలు, ఆటో రిక్షాలు, బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ప్రముఖ ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ చార్జీలకే సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
యాప్ పేరు తుది నిర్ణయ దశలో
యాప్‌కు పేరు పెట్టే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. “జై మహారాష్ట్ర”, “మహా-రైడ్”, “మహా-యాత్రి”, “మహా-గో” వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి తీసుకోనున్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు
ఈ యాప్‌ను మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ (MITRA) ప్రైవేట్ టెక్ సంస్థల సహకారంతో రూపొందిస్తోంది. ఆగస్టు 5న మంత్రిత్వ శాఖలో తుది సమీక్ష జరుగుతుందని రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. వేలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
తక్కువ వడ్డీతో కార్ లోన్
హిందూస్తాన్ టైమ్స్ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ యాప్ ద్వారా డ్రైవర్లుగా చేరాలనుకునే నిరుద్యోగులకు ముంబై బ్యాంక్ 10 శాతం వడ్డీ రేటుకు కార్ రుణాలు అందించనుంది. అదనంగా ఆర్థిక సహాయక సంస్థలు — అన్నాసాహెబ్ ఆర్తిక్ వికాస్ మహామండల్, విముక్త జాతి మహామండల్, OBC మహామండల్, MSDC వంటి సంస్థలు 11 శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వనున్నాయి. దీని వల్ల అర్హులైన అభ్యర్థులకు వడ్డీ లేనట్లే రుణం లభించనుంది.
కొత్త విధానాల్లో బైక్ టాక్సీకి ప్రత్యేక స్థానం
ఈ సర్వీసులో బైక్ టాక్సీలు కూడా కీలక భాగం కావనున్నాయి. వాటి సేవలు ఎలా ఉండాలన్న విషయంపై ప్రస్తుతం రవాణా శాఖ నిబంధనలు, ప్రమాణాలు రూపొందించే తుది దశలో ఉంది.
Also Read : Gold Price Sensational : గంటల వ్యవధిలోనే పరుగులు తీస్తున్న పసిడి ధరలు



















